
విడిపోవడమంటే
రహస్యంగా చనిపోవడమేనేమో..
సజీవ సాంగత్యం
పుటుక్కున తెగిపోవడమంటే
నిజంగా ఊపిరి ఆగిపోవడమేనేమో..
నిత్యం హృదయతంత్రిపై వాలి
రాగాలు మీటే చిలుక
కిరాతకంగా వేటాడబడడమంటే
గుండెల్లో విషాదం గూడు కట్టడమే..
పంచేద్రియాల హంసలు
విధి వికృత గీతల ఉచ్చుల్లో చిక్కి
సంచారక క్రియకు స్వస్తి పలకడమంటే
ఆనందం అశ్రుబిందువు కావడమే..
పడమట గాలికి
సజీవ స్వప్నాల తోట కకావికలమై
నెత్తుతి పూలు పూయడమంటే
చుక్క నెత్తురు చిందకుండా గుండె గాయం కావడమే..
చల్లని వెన్నెల్లో
అలుపెరుగని కెరటంలా
సాగిపోతున్న జీవితం చతికిలపడడమంటే
చితిమంటల్లో చెలిమి బూడిద కావడమే..
ఆర్ధిక దుమారానికి
నిమిత్తం లేని చిత్తం
అత్యాశా అత్తరు పులుముకోవడమంటే
నైతికతను కోల్పోయి రహస్యంగా మరణించడమే..
నిజంగా విడిపోవడమంటే
చనిపోవడమేనేమో..
("విడిపోవడమంటే చనిపోవడమే" అన్న మిత్రుడి మాట గుర్తొచ్చి..)
