e martë, 10 korrik 2007

ఇది జీవితం...



పిలిచింది జీవితం
సంకల్ప శక్తితో వెన్నుతట్టేలా!
దూరమైనా భారమైనా
మనసు కడిగి,
మమత వొడికి పయనించేలా!
పిలిచింది జీవితం-
జగతిని వెలిగించేలా!!

ఎటుపడితే అటు పలికే
నాలుక కాదు-
ఎటు వెళితే ధ్రువదీపమై సాగునో
అటు ఎగిసే సాధన సాగాలంటూ!
పిలిచింది జీవితం-
తెలిమంచులోని చల్లదనంలా!!

జయించాలనే కోరిక
ఎక్కడ ఊపిరి పోసుకుంటుందో
ఆ లక్ష్యం కోసం పరుగిడమంటూ!
పిలిచింది జీవితం-
కన్నీటి చుక్కలోని ఆర్తిలా!!

కాలం కోసం ఎదురుచూస్తూ
కూర్చుంటే
నవ్వుతుంది జీవితం-
దారితప్పిన బాటసారిని చూసి
వచ్చినవేళ ముగిసిందంటూ!!