e martë, 3 qershor 2008

పోస్టు చేయ(లే)ని ఉత్తరం..


నాన్నా.. నన్ను క్షమించు -
నీవైపు ఒక్కమాట కూడా మాట్లాడలేకపోయినందుకు !
వీళ్ళు నిన్ను అవమానపరుస్తూ ఉంటే
నా తెగిపోయిన నరాలను చిక్కబట్టుకుంటూ
వింటూ బ్రతికున్నందుకు !
నా కొడుకుకు అన్నప్రాసన్నం రోజు
నీకేదైనా అనారోగ్యం కలిగించి
నిన్ను రాకుండా చేయమని మొక్కుకున్నందుకు !!

కోరిన కట్నమిచ్చి మా వివాహం ఘనంగానే జరిపించినా
లాంచనాలు సరిగ్గా జరపలేదని వీళ్ళకు మనమీద కక్ష !
ఎన్నో అవమానాలను నాకోసం భరించావు -
మళ్ళీ ఇంకొక అవమానం నెత్తినేసుకుందామని
సంతోషంగా వచ్చావు !!

నువ్వు బాబు కోసం గిన్నె తెచ్చి నా చేతిలో పెట్టినప్పుడు
మా ఆడపడుచు దానిని లాక్కొని నేలకేసికొట్టి -
"వెండి గిన్నెకు గతిలేకపోయినా - ఎగురుకుంటూ వచ్చాడు
ముసలోడు.. విందుభోజనం తిందామని !" అన్నప్పుడు -
ఆ గిన్నె నేల మీద గిలగిలా కొట్టుకుంటూ
చేసిన ఆర్తనాదం, ఆమె మాటలు -
నా గుండెను ఎన్ని ముక్కలు చేసాయో !!

మా అత్తగారు "నీ తల్లి పతివ్రతయితే మేమెన్ని మాటలు
మాట్లాడినా నీవు నోరెత్తకూడదు" అని విధించిన ఆంక్షతో
నా తల్లి పాతివ్రత్యాన్ని నిరూపించుకునేందుకు
నా నోరు బిగుసుకుపోయింది నాన్నా !!

మీ ఎవ్వరితోను మాట్లాడవద్దని వీళ్ళ ఆఙ్ఞ !
ఇంత మానసిక క్షోభలోనూ నాకు కొంత మనశ్శాంతి
ఏమిటో తెలుసా నాన్నా -
మీరిచ్చిన ఆ ఇనుపపెట్టె !
నేను రాసుకున్న ప్రతి ఉత్తరం దానిలో పదిలం !!

పోస్టు చేసేందుకు నాకు గానీ, నా ఉత్తరానికి గానీ
బయటకు వెళ్ళే అవకాశం లేదు -
వీళ్ళెవరూ ఆ పెట్టెను ముట్టుకోరు..
దానిని చూస్తే వాళ్ళకి అసహ్యం !!

(అత్తింటి ఆరళ్ళకు బలవుతూ.. పుట్టింటి వాళ్ళకి పోస్టు చేయలేని ఉత్తరాలెన్నో)