e enjte, 3 korrik 2008

ఏ రాగమదీ.. ఏం గానమది


ఏ రాగమదీ..
అంబర మందున
తంబుర శృతి లేకున్ననూ
గగన మందున
మెరుపులు తంత్రులై
ఉరుములు స్వరములై
మేఘం వీణగా మ్రోగినది !

మేఘవీణకు వాన తాళం వేసినది
ఆ వానకు వనమున వెదురెదిగినది
ఎదిగిన వెదురు వేణువైనది
వెదురు వేణువైన వైనము
నే వర్ణింపలేనిది !

వేణువులోన వాయువు లీనమైనది
కలపలోని వాయువే
వాయులీనమైనది..
ఈ వీణ వేణు వాయులీనములు పలుకునది -
ఏ రాగమదీ.. ఏం గానమది..!!

గిరిపై గల శిల ఇలపై టకటక పడినది
ఆ శిల వేగం
మృదంగ జతుల విధమున ఉన్నది
ఆ జతులకు సంగతులు వేయుచు
గగనం గానం చేసినది !

గగన గానమునకు
పుడమి పులకించినది
ఆ పులకింతకు అల ఆలపించినది
అల ఆలాపనకు నది నర్తించినది
నది నర్తనకు ప్రకృతి పరవశించి పాడినది -
ఏ రాగమదీ.. ఏం గానమది..!!

e shtunë, 7 qershor 2008

రహస్య మరణం..


విడిపోవడమంటే
రహస్యంగా చనిపోవడమేనేమో..

సజీవ సాంగత్యం
పుటుక్కున తెగిపోవడమంటే
నిజంగా ఊపిరి ఆగిపోవడమేనేమో..

నిత్యం హృదయతంత్రిపై వాలి
రాగాలు మీటే చిలుక
కిరాతకంగా వేటాడబడడమంటే
గుండెల్లో విషాదం గూడు కట్టడమే..

పంచేద్రియాల హంసలు
విధి వికృత గీతల ఉచ్చుల్లో చిక్కి
సంచారక క్రియకు స్వస్తి పలకడమంటే
ఆనందం అశ్రుబిందువు కావడమే..

పడమట గాలికి
సజీవ స్వప్నాల తోట కకావికలమై
నెత్తుతి పూలు పూయడమంటే
చుక్క నెత్తురు చిందకుండా గుండె గాయం కావడమే..

చల్లని వెన్నెల్లో
అలుపెరుగని కెరటంలా
సాగిపోతున్న జీవితం చతికిలపడడమంటే
చితిమంటల్లో చెలిమి బూడిద కావడమే..

ఆర్ధిక దుమారానికి
నిమిత్తం లేని చిత్తం
అత్యాశా అత్తరు పులుముకోవడమంటే
నైతికతను కోల్పోయి రహస్యంగా మరణించడమే..

నిజంగా విడిపోవడమంటే
చనిపోవడమేనేమో..

("విడిపోవడమంటే చనిపోవడమే" అన్న మిత్రుడి మాట గుర్తొచ్చి..)

e martë, 3 qershor 2008

పోస్టు చేయ(లే)ని ఉత్తరం..


నాన్నా.. నన్ను క్షమించు -
నీవైపు ఒక్కమాట కూడా మాట్లాడలేకపోయినందుకు !
వీళ్ళు నిన్ను అవమానపరుస్తూ ఉంటే
నా తెగిపోయిన నరాలను చిక్కబట్టుకుంటూ
వింటూ బ్రతికున్నందుకు !
నా కొడుకుకు అన్నప్రాసన్నం రోజు
నీకేదైనా అనారోగ్యం కలిగించి
నిన్ను రాకుండా చేయమని మొక్కుకున్నందుకు !!

కోరిన కట్నమిచ్చి మా వివాహం ఘనంగానే జరిపించినా
లాంచనాలు సరిగ్గా జరపలేదని వీళ్ళకు మనమీద కక్ష !
ఎన్నో అవమానాలను నాకోసం భరించావు -
మళ్ళీ ఇంకొక అవమానం నెత్తినేసుకుందామని
సంతోషంగా వచ్చావు !!

నువ్వు బాబు కోసం గిన్నె తెచ్చి నా చేతిలో పెట్టినప్పుడు
మా ఆడపడుచు దానిని లాక్కొని నేలకేసికొట్టి -
"వెండి గిన్నెకు గతిలేకపోయినా - ఎగురుకుంటూ వచ్చాడు
ముసలోడు.. విందుభోజనం తిందామని !" అన్నప్పుడు -
ఆ గిన్నె నేల మీద గిలగిలా కొట్టుకుంటూ
చేసిన ఆర్తనాదం, ఆమె మాటలు -
నా గుండెను ఎన్ని ముక్కలు చేసాయో !!

మా అత్తగారు "నీ తల్లి పతివ్రతయితే మేమెన్ని మాటలు
మాట్లాడినా నీవు నోరెత్తకూడదు" అని విధించిన ఆంక్షతో
నా తల్లి పాతివ్రత్యాన్ని నిరూపించుకునేందుకు
నా నోరు బిగుసుకుపోయింది నాన్నా !!

మీ ఎవ్వరితోను మాట్లాడవద్దని వీళ్ళ ఆఙ్ఞ !
ఇంత మానసిక క్షోభలోనూ నాకు కొంత మనశ్శాంతి
ఏమిటో తెలుసా నాన్నా -
మీరిచ్చిన ఆ ఇనుపపెట్టె !
నేను రాసుకున్న ప్రతి ఉత్తరం దానిలో పదిలం !!

పోస్టు చేసేందుకు నాకు గానీ, నా ఉత్తరానికి గానీ
బయటకు వెళ్ళే అవకాశం లేదు -
వీళ్ళెవరూ ఆ పెట్టెను ముట్టుకోరు..
దానిని చూస్తే వాళ్ళకి అసహ్యం !!

(అత్తింటి ఆరళ్ళకు బలవుతూ.. పుట్టింటి వాళ్ళకి పోస్టు చేయలేని ఉత్తరాలెన్నో)

e hënë, 26 maj 2008

మళ్ళీ ఎందుకొచ్చావ్?!


ఏంటి.. మళ్ళీ వచ్చావ్??
ఇంక ఎప్పుడూ నా జోలికి రాను అని
చెప్పి అప్పుడెప్పుడో వెళ్ళిపోయావ్ కదా!!
మళ్ళీ ఎందుకొచ్చావ్?!

నువ్వు నన్ను వేదించిన రోజులు
నాకింకా గురుతే..
నీ వల్ల జరిగిన గాయం
ఇంక నా వంటి మీద పదిలమే!!

ఎంతో మందికి ఏడుపుని పంచావ్
అందులో నేనూ ఒకదానిని..
ఇంకా నీ వల్ల ఏడవటం
నా వల్ల కాదు..
దయచేసి వచ్చిన దారినే పో!!

నువ్వు ఇంకెప్పుడూ రావనే కదా
ఆ రోజు ధైర్యం చేసి
అందరూ కాదంటున్నా
చచ్చిపోతావ్ అని చెప్పినా
ఆపరేషన్ కి ఒప్పుకున్నాను..
మరి మళ్ళీ ఎందుకొచ్చావ్ -
చచ్చానో లెదో అని చూద్దామనా??

ప్రియమైన "నొప్పి" -
ఇంక తప్పుకో నా జీవితం నుంచి
నిన్ను భరించే ఓపిక నాకు ఇంక లేదు..

e mërkurë, 30 prill 2008

శ్రామికుడు..


లాల్ సలాం కామ్రేడ్స్!

మేం శ్రామికులం
బతుకు భారమైన బడుగు జీవులం
రక్తం ఓడ్సి పని చేయనీకె పుట్టినోల్లం
జనం "తు" అంటే తుడుసుకు పోయేటోల్లం..
ఇయ్యాల మా కథ జెప్త యినుండ్రి
యిని జరంత సోంచాయించుండ్రి..

సాకలోడి సేతులు నరకనీకె "Ironbox"లు వస్తే
మొగ్గం నేసే నేతగాడి కాళ్ళు ఇరసనీకె "Machine"లు వస్తే
శ్రమను నమ్ముకున్నోల
శవాలు జూస్తుండ్రు..
8కూలీలు చెల్లించకపోగ
కాటికి పంపుతుండ్రు..

ఈత కల్లు మాని కొడుకులు "brandy"లకు ఎగవదితే
కొబ్బరి బోండాలు మరచి "limca"లకు నాలికసాస్తె
ఏం జెప్పమ్మంటవ్
మమ్మల్నెట్ల బతకమంటవ్..

శ్రామికుల గుండెలో ఎర్ర జెండాలు ఎగరేసిన కామ్రేడ్స్
ర్యాలీలు మాని రాస్తారోకోలు ఆపి
జర ఇసంతకొచ్చి మా బతుకులు సూడుండ్రి
మా కన్నీటి రకతాలను జండాలకు పుయ్యుండ్రి..

రైల్వే కూలీల నెత్తి నరకనీకె "Trolley"లు వస్తే
చెత్తకుప్ప లెత్తనీకె "Bulldozer"లు వస్తే
శ్రామికుల రోజని
మాకు దినాలు జేస్తుండ్రు..
మా నడ్డిన తన్ని
జనం సలాంలు కొడుతుండ్రు..

కామ్రేడ్స్ -
మాకు ఇండ్లొద్దు, దవాఖానలొద్దు
బడిలొద్దు, ప్రబుత్వ దొడ్లొద్దు
ప్రజాసామ్యం-పగటికలలు మాకొద్దే ఒద్దు..

మా శ్రమను గుర్తించి కూలీలు ఇప్పియుండ్రి
జర మా బడుగులకొచ్చి మా బతుకును సూడమనుండ్రి..

(మే డే సందర్భంగా ప్రతి శ్రామికుడికి అంకితమిస్తూ..)

e premte, 25 prill 2008

పుట్టినరోజు..

వెన్నెల లేదు, నేడు చల్లని గాలులు కూడా లేవు
ఈ ప్రాణం పోసిన తల్లి నీ జోలలు లేవు..

నవ్వులు లేవు, నన్ను మురిపించే పువ్వులు లేవు
నన్ను నవ్వించే నాన్నా, నీ ఈలలు లేవు..

అమ్మా! నాన్నా!!
నాతో ఈ పుట్టినరోజు నాడు మీరు లేరు..

తలని నిమిరే దీవెనలు, చిరునవ్వుల బహుమతులు
మమతలు నిండిన కౌగిళ్ళు, మనసును తలపించే ఆనందాలు
కరువైపోయిన ఈ రోజు -
నా కన్నీళ్ళే అక్షింతలు
మీ తలపులే పుట్టినరోజు కానుకలు..

e premte, 4 prill 2008

కల నిజమయ్యింది - నిజం దూరమయ్యింది..


దేశం కాని దేశంలో, ఈ మహానగరంలో
కిక్కిరిసిన ఈ జనారణ్యంలో
ఊపిరి బిగబట్టి నిసత్తువతో అడుగులు వేస్తూ
చటికలా పడిపోతే..
నా తోడుగా ఇంకాస్త దూరం నడవమని
చేయూతలేవి కనిపించకపోతుంటే అనిపిస్తుంది..
నేను దూరంగా వచ్చానా.. లేక దూరమయ్యానా??

నా కలలలో ఒకటి "singapore visit" అని
అమ్మకి చెప్తే, తను ఒక నవ్వు నవ్వి
"your dream will come true" అన్న రోజు గుర్తొచ్చి
కన్నీళ్ళు కాలువలై పారుతుంటే
ఙ్ఞాపకాలు పడవలుగా తేలుతుంతే
ఆలోచించక ముందుకి సాగిపో
అని చెప్పే మనిషి పక్కనలేకపోతే అనిపిస్తుంది..
కన్నుల కన్నీరు నన్ను కరిగిస్తుందా.. లేక కుదిపేస్తుందా??

ఎవ్వరులేని ఒంటరి జీవితంలో
నేనున్నానంటూ వచ్చిన నేస్తం
ఇప్పుడు కళ్ళముందులేక కలవరపెడుతుంటే
అతని ఙ్ఞాపకాలు మనసుని దహించి వేస్తుంటే
ఏమి చేయాలో తెలీక తడబడుతుంటే అనిపిస్తుంది..
నేను "కల"కి దగ్గరయ్యానా.. లేక "నిజం"కి దూరమయ్యానా??

e enjte, 3 prill 2008

బిచ్చగత్తె..


భుజాన వేలాడుతున్న జోలె
దేశంలోని దారిద్ర్యాన్ని మూటగట్టి
చూస్తున్నట్లుగా వుంటుంది !

చిన్నాభిన్నమైన ఆమె ఆకృతి
అస్థవ్యస్థమైన ఆర్థికవ్యవస్థను
గుర్తుకుతెస్తుంది !

'అయ్యా.. ధర్మం చెయ్యండి..' అన్న
దీనమైన అర్థింపు
అప్పుల కోసం విదేశాలకు
చేయిచాస్తున్న మన దేశాన్ని
స్ఫురణకు తెస్తుంది !

చేదు ఙ్ఞాపకాలు మిగిల్చిన అనుభవాలు
ఆమె ముడుతలు పడిన ముఖంపై
లీలగా కదలాడుతూ వుంటాయ్ !

ఓ ధర్మాత్ముడు వేసిన రూపాయి బిళ్ళను
ఆప్యాయంగా చూసుకుంటూ
అసంకల్పితంగా రెండు
కన్నీటి బిందువుల్ని రాలుస్తుంది !

'అభిమానం అడ్డొచ్చినా
ఆకలి ముందు అన్నీ దిగదుడుపే
'అన్న నగ్నసత్యం తెలిసిన ఆ బిచ్చగత్తె
దీనంగా ముందుకు సాగుతుంది -
విశ్వవీధిలో అడుక్కుతింటున్న
భారతదేశంలా..
జాతీయపతాకంలో అవనతం
అవుతున్న ఆత్మగౌరవంలా..!!

e mërkurë, 2 prill 2008

వర్షం..


సాగరుడు
తన ప్రియ పుత్రిక నీటిని
సూర్యుడి మధ్యవర్తిత్వంతో
ఎంతో ఉన్నత సంబంధమని సంబరపడి
మేఘానికిచ్చి
పెళ్ళి చెసాడు..
కట్నకానుకలుగా
తన గర్భంలోంచి
రత్నాలు, ముత్యాలు ఇచ్చాడు..
అయినా -
పెళ్ళి విందులో
ఉప్పు నీళ్ళు ఇచ్చారని
అలిగిన మేఘం
నీటిని
పుట్టింటికి పంపాడు..

(అమ్మ చెప్పిన చిన్ననాటి కథ.. కొంచం మార్చి)

e martë, 1 prill 2008

నేనేం చేయను?!?!?!


కాలమొక ప్రవాహమైతే
చిరుచేపలా మారి ఎదురీదనా?!
ఆశ ఆకాశంలో వెన్నెలయితే
అందుకొనగా నిచ్చెనగా మారనా?!

మండే గుండెల జ్వాలలకు
శీతల జలాన్నై శాంతపరచనా?!
ఈ బ్రతుకుని ఎవరూహించని
మహాభాష్యంగా వ్రాసుకొందునా?!

ఎదలో మెదిలే భావసౌరభ సుమాన్ని
హృదంతర జ్వలన శిఖలలో
సుమకోమల దళాలను ఒక్కొక్కటిగా
ఆహుతి చేసుకోనా?!

ఎన్నినాడులు గడిచినా
చిట్టచివరికి తెలిమంచులా కరిగిపోయే -
ఒక స్వప్నం
చెదిరిపోయిందనుకోనా?!
ఒక స్వర్గం
తొలగిపోయిందనుకోనా?!

ఏం చేయను -
నేనేం చేయను?!

e hënë, 31 mars 2008

Thank You..


Thank you for always being there
To listen and understand me.
I appreciate all you did for me
And all you still do.

Thank you for making me whole again
For putting my pieces back together.
I appreciate you putting my life happy
You really gave meaning to my life.

You may not understand
Why i do, what i do.
But you never criticized
You just helped me through.

I knew i could come to you
When i feel down.
Coz i knew you'd always be there,
to pick me up and say that everything will be ok.

e premte, 28 mars 2008

ఙ్ఞాపకాలు పాతవే.. ప్రదేశమే కొత్త


ఎవరూ తెలియని ఈ దేశంలో కూడా
అమ్మ నన్ను తరుముతున్నట్టు
నాన్న అల్లరి పెడుతున్నట్టు
అన్నయ్య వెక్కిరింతకి అక్క బుజ్జగిస్తున్నట్టు
ఏంటో ఇదంతా -
ఙ్ఞాపకాలు పాతవే.. ప్రదేశం మాత్రమే కొత్త

రోజూ లాగనే ఈ రోజు కూడా
పగలు తరువాత రాత్రి వచ్చింధి
చుట్టూ చీకటి అలుముకుంది..
ఒంటరి ఛాయలు
మనసు నిట్టూర్పులు
కన్నీటి చిత్రాలు
అన్నీ పాతవే.. గది మాత్రమే కొత్త

అర్ధరాత్రి పన్నెండు దాటింది -
phone కోసం వెతుకుతున్నాను
అతనికి call చేద్దామని..
International roaming కదూ
మర్చిపోయాను..
మరి ఈ సంగతులన్నీ అతనికి చెప్పడం ఎలా?
నా మనసు బాధ, కన్నీటి గాథ తెలపటం ఎలా?
చూద్దాం -
నిదురపోతే కలలోకి వస్తాడేమో
నేనున్నానంటూ చేతిలో చేయి వేస్తాడేమో
మనసు పాతదే.. దానికి కలిగిన ప్రేమే కొత్త

e premte, 21 mars 2008

వర్షం కురిసిన వేళ..


నింగి పెదవి ముద్దు తునకలు.. చినుకులల్లే నేల తాకెనా??
తడి తనువు సిగ్గు దాచగా.. మబ్బు చీర చీకటాయెనా??
చిరుగాలి చెలికాడుగా మారి.. చెక్కిళ్ళు గిల్లిపోయెనా??
నాలో నేడు ఈ వాన చలి సెగలు రేపెనా??

నా నవ్వు చూసి పూలు పూయనన్నవి
నా సొగసు చూసి తారలు మెరువనన్నవి
ఓ వానా.. నీవైనా చెప్పరాదా ఈ వింత ఏమిటో?
నాలో మొదలయిన ఈ మత్తు ఎందుకో??

నడకలన్నీ వయ్యారమవుతున్నాయి
అడుగులన్నీ మయూరమై నాట్యమాడుతున్నాయి..

పగటి కలలే నిండిపోయె కనులలో ఎందుకో?
వేడి సెగలే మొదలయ్యే తనువులో ఏమిటో?
ఈ ఊహలన్నీ ఓ వరమా?
ఇవి ఆపుట నా తరమా??
ఓ వానా.. ఇకనైనా చాలించమ్మా నీ అల్లరి
ఏమైపోతానో చూడాలి నేను ఈ రాతిరి..

e premte, 14 mars 2008

మూగబోయిన హృదయ సంగీతం.. నా ఈ విశాదగీతం...


తేనె కన్నా తీయని మాధుర్యం
పాలకన్నా తెల్లని స్వచ్చదనం
అమృతం కన్నా హాయినిచ్చే
నీ సాన్నిహిత్యం -నాకెంతో ఇష్టం !

నీ సన్నిధిలో నేను నిలవాలని
నీ ఒడిలో ఒక్క నిమిషం నా తల వాల్చాలని
తీయతీయని నీ పలుకులు వినాలని
గుండెకు గుండె చేర్చి
గుండె లోతుల్లోని రహస్యాలు విందామని
ఆరాటపడే ఆశతోహృదయం చేసే అలజడితో
నీ చెంతకు వస్తే...

దయలేని కాలం కక్ష కట్టింది -
మనస్సులేని వీణ మూగబోయింది -
లయ తప్పిన శృతిని వినిపించింది విశాదగీతం !

వెలవెలబోయిన వెన్నెల నన్ను చూసి
'అయ్యో పాపం..' అంది -
హృదయం లేని నిశీది రాత్రి కూడా
నన్ను చూసి కంటతడి పెట్టింది !!

కాలిపోయిన కోటేశు..


ప్రియా..
నువ్వు లైలావో కావో - నేను మజ్ఞూనే!
అనార్కలివో కావో - నేను సలీంనే!
పార్వతి ఔనో కాదో -
నేను దాసుడను.. నీ దేవదాసును!

సఖి..
నీ కోసం కాలిపోయిన కోటేశుని నేను
బండల్ని పిండిన నా జబ్బలకేసి
ఓరగా, దోరదోరగా చూసావు!
బండెడు గడ్డిమోపును వాటంగా ఎత్తికుదేస్తే
ఎక్కిరింతగా నవ్వావు!
దొడ్లో ఆదమరచి నేను నిదురపోతే
అమాంతం నామీద పడ్డావు -
ప్రేమన్నావు.. ప్రేమకై ప్రాణమిస్తానన్నావు!

తీరా చూస్తే -
మీ ఇంటి గుమ్మం ముందు దిష్టిబొమ్మను చేసావు
దొంగను చేసావు.. దోషిగా నిలబెట్టావు!
అయినా.. నువ్వంటే నాకిష్టం!!

ఏమిటో ఈ వింత..
నీ కులపోళ్ళంతా తాళ్ళతో బంధిస్తే -
నీ చేతుల్తో గట్టిగా వాటేసుకున్నట్టుంది..
ఒళ్ళంతా కిరోసిన్ పోసి తడిపేస్తుంటే -
ముద్దుల్తో తడిపి తలారా స్నానం చేయించినట్టే ఉంది..
అంటరాని మంటలు దేహమంతా అలుముకుంటుంటే -
తొలినాటి శృంగార విరహ తాపాలు గుర్తుకొచ్చాయి..
అగ్గై బొగ్గై కూలుతున్నప్పుడు కూడా -
అలసిసొలసి నీ యెదపై కునుకుతీసిన ఆలాపనే..

ఓ నా చెలి -
నీ కౌగిట్లో ఒదిగి
నాకు మరోమారు చావాలని ఉంది..

(విజయవాడలో జరిగిన సంఘటన ఆధారంగా..)