
బతుకు బండి లాగుతున్న చిరుద్యోగికి
మండుటెండలో మలయపవనంలా
ఎడారిలో ఒయాసిస్సులా
ఒకింత ఊరట నిచేది... లంచ్ టైమ్!
లడ్డయినా, బ్రెడ్డయినా -
కాయైనా, పండైనా
చప్పగా చల్లారిన పచ్చడి మెతుకులైన
సహచరుల చలోక్తులతో
సమభావం పెంచే
షడ్రుచుల సమ్మిళితమే... లంచ్ టైమ్!
మాటల ఈటెలు విసురుకున్నా
చూపుల తూణీరాలు చురుక్కుమన్నా
కష్టాలు కలబోసుకున్నా,
కథలెన్నో తిరిగేసుకున్నా
కారాలు, మమకారాలు పంచే
రసరమ్య కావ్యం... లంచ్ టైమ్!
సీరియల్స్, సినిమాలు
నక్సలిజం, ఉగ్రవాదం
కంప్యూటరైజేషను, గ్లోబలైజేషనుల
ప్రపంచ వార్తల పరంపర
శరవేగంతో చర్చించే
కమనీయ వేదిక... లంచ్ టైమ్!